భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, టెలివిజన్ వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2014 సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న సమయంలో సిద్ధు పలు అక్రమాలకు పాల్పడారు అని ఆరోపణలు వస్తున్న క్రమంలో.. ఆయన ఖాతాలను ఐటి అధికారులు సీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయంలో ఆయనకు గతంలో అధికారికంగా నోటీసులు కూడా పంపించారు. దాదాపు రూ.50 లక్షల పన్నును సిద్దూ శాఖకు బకాయి పడ్డారని అధికారులు తెలిపారు. అయితే అవే నోటీసులపై సిద్దూ కమీషనరుకి అపీల్ చేసుకోగా.. ఆయన ఎట్టిపరిస్థితుల్లోనైనా బకాయిలు చెల్లించాల్సిందేనని చెప్పారు. అయినా సిద్ధూ ఆ విషయంపై తదుపరిగా ఎలాంటి స్పందనను తెలియజేయకపోవడంతో ఎట్టకేలకు శాఖ గురువారం ఒక ప్రకటన చేసింది. సిద్ధూ బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.


ఆదాయపు పన్ను శాఖకు దాఖలు చేసిన రిటర్న్సులో వ్యక్తిగత అవసరాల కోసం వస్తువులు కొనడం, టూర్లకు వెళ్ళడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డీజిల్ ఖర్చులు మొదలైన వివరాలను పేర్కొన్నారు. అయితే వీటిలో దేనికీ కూడా ఆయన బిల్లులు గానీ.. సంబంధిత పత్రాలను గానీ జతపరచలేదు. కాబట్టి... ఆ సొమ్ముపై ఆదాయపు పన్ను కట్టాల్సిందేనని కమీషనర్ పేర్కొన్నారు.


ప్రస్తుతం సిద్ధూ పంజాబ్‌లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో కూడా సిద్ధూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున, కామెడీ టీవీ షోల్లో కనిపించకూడదని ఆయన పై పలువురు పిటీషన్లు ఫైల్ చేశారు. అలాగే 2006లో ఓ రోడ్డు యాక్సిడెంట్ కేసులో కూడా సిద్ధూపై కేసులు నమోదు అయ్యాయి.