Amruta Fadnavis on Maha New Govt: ఇటీవల మహారాష్ట్రలో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో ఏక్‌నాథ్ షిండే సీఎం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మారిపోయారు. కేవలం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఏక్‌నాథ్ షిండే.. కింగ్ మేకర్‌గా మారుతారనుకుంటే ఏకంగా కింగ్ అయి కూర్చొన్నారు. ఈ పరిణామాలు తనను కూడా ఆశ్చర్యపరిచాయని తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ పేర్కొనడం గమనార్హం. నటి, గాయని, బ్యాంకర్, సోషల్ యాక్టివిస్ట్ అయిన అమృత తాజాగా మహా రాజకీయ పరిణామాలపై స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో నేను లండన్‌లో ఉన్నాను. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగం కారనే అనుకున్నాను. కానీ పార్టీ ఆదేశాలను ఆయన పాటించారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రోజు.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేవేంద్ర ఫడ్నవీస్ మా కూతురు దివిజాను కూడా తీసుకెళ్లారు. దివిజాకు ఫడ్నవీస్ అప్పటికీ ఏమీ చెప్పలేదు. రాజ్‌భవన్‌కు వెళ్లాకే ఇకపై తన నాన్న డిప్యూటీ సీఎం అనే విషయం దివిజాకు తెలిసింది.' అని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు.


మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇటీవల ఫడ్నవీస్ తన సొంత నియోజకవర్గం నాగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్ షో నిర్వహించగా ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని అమృత ఫడ్నవీస్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం అభివృద్ది ప్రధానంగా ముందుకు సాగే ప్రభుత్వం ఉందని అభిప్రాయపడ్డారు. 


కాగా, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి పార్టీపై, ప్రభుత్వంపై తిరుగుబాటుపై చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలింది. ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. షిండే కొత్త పార్టీ పెడుతారా.. బీజేపీతో కలుస్తారా అనే సందేహాల నడుమ.. ఆయన కాషాయ పార్టీతో కలవడమే కాదు, ఏకంగా సీఎం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.