భిక్షాటన కూడా ఉద్యోగమేనా..?: చిదంబరం సూటి ప్రశ్న
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం వరుస ట్వీట్లతో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఉద్యోగాలను సృష్టించడంపై కేంద్రానికి స్పష్టతలేదని.. పకోడాలు అమ్ముకోవడం ఉద్యోగమైతే.. భిక్షాటనని కూడా ఉపాధిగా గుర్తించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పకోడాలు అమ్ముకోవడం ఉద్యోగమైతే.. బిక్షాటన కూడా అలాంటిదే అవుతుంది. జీవనోపాధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో యాచవృతిలోకి నెట్టబడిన పేదలు, దివ్యాంగులను కూడా ఉద్యోగులుగానే గుర్తించాలి" అంటూ కేంద్ర సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఉద్యోగాలపై చర్చ సందర్భంగా ఉద్యోగం, స్వయం ఉపాధికి మధ్య తేడాను దృష్టిలో ఉంచుకోవాలని మరో ట్వీట్ చేశారు. భద్రతతో కూడిన ఉద్యోగాలను ఎన్ని సృష్టించారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇటీవల ప్రధాని మోదీ ఒక జాతీయ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి పకోడాలు అమ్ముతూ 200 రూపాయలను ఇంటికి తీసుకెళ్తే అది ఉద్యోగం కాదా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే..!!