ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తేల్చిచెప్పారు. జగన్ ప్రస్తుతం నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కలిగిరి శివారులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని జగన్ స్పష్టం చేశారు. 'ప్రత్యేక హోదా' అనేది రాష్ట్రంలో ప్రతి పౌరుడి హక్కు అని జగన్ చెప్పారు.


'ప్రత్యేక హోదా' ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ మార్చి 1 నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తారని.. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.


ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు గురించి చంద్రబాబు అడక్కుండా వాటిని శాశ్వతంగా సమాధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైఎస్ జగన్ విమర్శించారు.