కర్ణాటకలోని బెల్గావి ప్రాంతానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశనూరు అనే పల్లెటూరులో ఓ ఆలయం ఉంది. స్నానిక అరులుప్పనవర విరక్త మఠం ఆధ్వర్యంలో నడిచే ఆ ఆలయంలో శివలింగంతో పాటు క్రైస్తవుల ఆరాధ్య దైవాలైన యేసుక్రీస్తు, మేరీమాతల విగ్రహాలు కూడా ఉండడం విశేషం. ఈ ఆలయంలో పనిచేసే పూజారి క్రాస్ ధరించడంతో పాటు రుద్రాక్షమాలను కూడా వేసుకోవడం గమనార్హం. బనారస్ నగారా స్టైల్‌లో ఈ ఆలయాన్ని ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆలయం గోడలపై బసవేశ్వరుని శ్లోకాలతో పాటు బైబిల్ సూక్తులు కూడా దర్శనమిస్తున్నాయట. గోవా నుండి కర్ణాటకకు వలస వచ్చిన ఆర్మడో ఆల్వేరెస్ అనే ఓ విదేశీయుడు..  ఆ తర్వాత అనిమానంద స్వామిగా పేరు మార్చుకొని.. ఆ తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించారట. ఇదే ప్రాంతంలో ఆయన రెండు పాఠశాలలను కూడా ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల నుండి ఈ ఆలయంలో హిందువులతో పాటు క్రైస్తవులు కూడా పూజలు చేస్తున్నారని.. ఆ గ్రామస్తులు ఆ విధంగా మత సామరస్యంతో జీవిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. 


ఆ ఆలయాన్నే స్థానికులు "చర్చి గుడి" పేరుతో పిలుస్తుంటారు. సంక్రాంతి, క్రిస్మస్ లాంటి పండగలను కూడా ఆ పల్లెటూరులో జనాలు కలిసే చేసుకుంటారట. ఈ చర్చిలో పూజారిగా పనిచేస్తున్న మనినో గోన్జాల్వెస్ అలియాస్ మనినో స్వామి మాట్లాడుతూ "ఇక్కడి ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ఇలా మత సామరస్యంతో జీవించడం అలవాటైపోయింది. ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తారు. అలాగే ఈ ఊరిలో ఒక మతం వారిని మరో మతం వారు వివాహం కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే వివాహం చేసుకున్నా ఎవరి మతం వారిదే. మత మార్పిడి అంటే మా ఉద్దేశంలో ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే లెక్క. మతం కంటే ప్రేమే గొప్పదని మా నమ్మకం" అని ఆయన తెలిపారు.