India - Bhutan rail link: ఇండియా - భూటాన్ మధ్య రైల్వే లింక్.. ఎప్పుడు పూర్తి కానుందంటే..
India - Bhutan rail link: భారత్ - భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, వస్తుసామాగ్రి ఎగుమతులు, సాంస్కృతిక మార్పిడి, తదితర అంశాల్లో రైల్వే ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది అని రెండు దేశాలు భావిస్తున్నాయి. 2018లో భూటాన్ ప్రధాని భారత్‌కి వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై చర్చలు ఊపందుకున్నాయి.
India - Bhutan Rail Link: ఇండియాను, పొరుగునే ఉన్న భూటాన్ దేశాన్ని కలుపుతూ ఓ ఇంటర్నేషనల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈశాన్య భారతంలో రైల్వే సదుపాయాలను విస్తరించే ప్రణాళికల్లో భాగంగా భారత ప్రభుత్వం రూ. 120 బిలియన్ రూపాయలను కేటాయించి మరీ భారత్ ఈ రైల్వే లైన్ నిర్మించనున్నట్టుగా భూటాన్ లైవ్ శనివారం వెల్లడించింది. భూటాన్‌కు చెందిన మీడియా సంస్థ కథనం ప్రకారం భారత ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న 57.5 కిలోమీటర్ల రైలు మార్గం అస్సాంలోని కోక్రాఝర్‌ను భూటాన్‌లోని సర్పాంగ్‌లోని గెలెఫును అనుసంధానం చేయనుంది. 2026 నాటికి ఈ రైల్వే ప్రాజెక్ట్ పూర్తి కానుంది అని తెలుస్తోంది.
నెల రోజుల క్రితమే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎస్ జైశంకర్ ఇండియా - భూటాన్ మధ్య ఈ ప్రతిష్టాత్మక రైల్వే లైన్ కి సంబంధించి జరుగుతున్న చర్చల గురించి సూచనప్రాయకంగా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీడియాతో జై శంకర్ మాట్లాడుతూ, " అస్సాం నుండి ఇండియా - భూటాన్ ను అనుసంధానం చేస్తూ రెండు దేశాల మధ్య రైల్వే లైన్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా భూటాన్ పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు అస్సాంకు సైతం ప్రయోజనం చేకూరనుంది. అస్సాంలోని కోక్రాఝర్ కి భారత్ - భూటాన్ సరిహద్దుల్లో భూటాన్ భూభాగంలో ఉన్న గెలెఫు మధ్య ప్రతిపాదిత రైల్వే లింక్ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేయనుంది.
భారత్ - భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, వస్తుసామాగ్రి ఎగుమతులు, సాంస్కృతిక మార్పిడి, తదితర అంశాల్లో రైల్వే ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది అని రెండు దేశాలు భావిస్తున్నాయి. 2018లో భూటాన్ ప్రధాని భారత్‌కి వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై చర్చలు ఊపందుకున్నాయి.
కోక్రాఝర్ - గెలెఫు రైల్వే లైన్ నిర్మాణం భవిష్యత్తులో మరిన్ని రైల్వే లైన్ ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. భారత్ - భూటాన్ మధ్య 2005లో ఒక అవగాహనా ఒప్పందం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినప్పుడే రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న పట్టణాలను రైల్వే నెట్‌వర్క్ ద్వారా అనుసంధానం చేయాలనే ఆలోచనకు మొగ్గతొడిగింది.