యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జీ మీడియా "ఇండియా కా డీఎన్‌ఏ కాన్ క్లేవ్" కార్యక్రమంలో తన మదిలోని మాటలను పంచుకున్నారు. తాను చేసే పనుల ద్వారానే ప్రజల ఆదరణను పొందుతానని చెప్పకనే చెప్పారు. ఇక కుల, మత రాజకీయాలకు కాలం చెల్లనుందని జోస్యం చెప్పారు. బీజేపీ యువత ఆశలను అడియాసలు చేసిందని.. ఆ పార్టీ పట్ల వారు మొగ్గు చూపకపోవడానికి ప్రధాన కారణం అదేనని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని కూడా అన్నారు. ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన కేవలం రిబ్బన్ కటింగ్లు చేయడానికి మాత్రమే మొగ్గు చూపారు తప్పితే.. ప్రాజెక్టులను ప్రారంభించడానికి మాత్రం ముందుకు రాలేదని విమర్శించారు. భారతదేశానికి కొత్త ప్రధాని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన అఖిలేష్ తాను మాత్రం ఆ రేసులో లేనని తెలిపారు. 


కాంగ్రెస్ పార్టీపై కూడా అఖిలేష్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. మంచి రాజకీయ వారసత్వం ఉన్న పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఇంకా కష్టపడాలని హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వం కాశ్మీరు సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. తాము మాత్రం సామాజిక న్యాయమనే అంశంతోటే రాబోయే ఎన్నికల్లో ప్రజల అభిమానాన్ని చూరగొంటామని అఖిలేష్ అభిప్రాయపడ్డారు.


ఇతర రాష్ట్రాల్లో మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు నాయుడు మొదలైన వారు నిజంగానే అత్యున్నతమైన రీతిలో పాలనను అందిస్తున్నారని తెలిపారు. మోదీ పాలనపై మాట్లాడుతూ.. ఆయన నియోజకవర్గం యూపీలో ఉన్నంత మాత్రాన ఆ రాష్ట్రానికి ఆయన వల్ల జరిగిన లాభం మాత్రం శూన్యమని అఖిలేష్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు ఉపయెగించాలని.. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని డిమాండ్ చేశారు.