కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు ధాటికి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బుధవారం నుండి ఆగస్టు 18 వరకు దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. 'ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ను తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అందుకే శనివారం (ఆగస్టు 18) మధ్యాహ్నం వరకు విమానాల రాకపోకలను నిలిపివేశాము. ప్రయాణీకులు దయచేసి ఇది గమనించగలరు.' విమానాశ్రయ ప్రతినిధి ఒకరు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు బుధవారం భారత వాతావరణ శాఖ కేరళ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.



 



 



 


అంతకుముందు ఎయిర్ పోర్ట్ అధికారులు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలవరకు నిలిపివేస్తామని ప్రకటించారు. అయితే, పరిస్థితి దృష్ట్యా శనివారం వరకు పొడిగించారు. మంగళవారం సాయంత్రం ఇడుక్కి జలాశయం యొక్క రెండు గేట్లు ఎత్తేసి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో.. పెరియార్‌ నదీ తీరంలో ఉన్న కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలను నిలిపివేశారు.


కేరళలోని చాలా జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కొచ్చి వాతావరణ శాఖ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.



 


భారతదేశ వాతావరణ శాఖ (IMD) వయనాడ్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్, మలప్పురం, పాలక్కాడ్, ఇడుక్కి మరియు ఎర్నాకుళం జిల్లాలకు గురువారం వరకు రెడ్ అలర్ట్ (భారీ నుండి అతి భారీ వర్షాలు) జారీ చేసింది.


ఇడుక్కి, కోళికోడ్, కన్నూర్, వయనాడ్, మలప్పురం వంటి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికీ ఆయా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కోనసాగుతున్నాయి. కొండచరియలు దిగువన నివాసముండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ జిల్లాలో 124 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు 13,800 మందికి ఆశ్రయం కల్పించారు.


ఉదయం 2.30 గంటలకు ముల్లపెరియార్ డ్యాం గేట్లు ఎత్తేయడంతో.. పెరియార్ నది ఒడ్డున నివసించే ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా అక్కడి నుండి తరలించారు.


1924 తరువాత ఇంతటి ప్రకృతి కోపాన్ని కేరళ చవిచూడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రతీఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే ఓనం ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు.


నివేదికల ప్రకారం, కేరళలో ఇప్పటివరకు వరదలు, భారీ వర్షాల కారణంగా ఆగస్టు 8 నుంచి 43 మంది చనిపోయారు. దాదాపు 60,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.