కాలం గడుస్తున్నకొద్దీ 'కరోనా వైరస్' విజృంభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 39 లక్షలకు చేరుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి వేగంగానే ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 60 వేలకు చేరుకుంది. దీంతో దేశవ్యాప్తంగా అలజడి రేగుతోంది. మరోవైపు మరో నెల రెండు నెలల వ్యవధిలో భారత దేశంలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరితో మాట్లాడారు. 


భారత దేశంలో ఇప్పటి వరకైతే అద్వాన్నస్థితి లేదని హర్షవర్థన్ స్పష్టం చేశారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విధంగా పరిస్థితి ఏ మాత్రం లేదన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా సిద్దంగా ఉన్నామని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ తో మరణాల రేటు కేవలం 3.3 శాతమేనన్నారు. అలాగే రికవరీ  రేటు కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రికవరీ రేటు 29.9 శాతంగా ఉందన్నారు.  ఇది గత మూడు రోజుల్లో రెట్టింపైందని తెలిపారు. 


మరోవైపు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు 843 ఆస్పత్రులు పని చేస్తున్నాయని తెలిపారు. అందులో లక్షా 65 వేల 991 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా 1991 కరోనా వైరస్ హెల్త్ సెంటర్లు ప్రారంభించామన్నారు. వాటిలోనూ లక్షా 35 వేల 643 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిలో ఐసోలేషన్ సహా ఐసీయూలు కూడా ఉన్నాయని వివరించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..