రైలులో దూర ప్రయాణాలు బోర్ కొడుతున్నాయా? అయితే డిసెంబర్ వరకు ఆగండి.. ఎంచక్కా ప్రయాణ సమయంలోనే షాపింగ్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయాణం చేసేటప్పుడు సమయం వృథా కాకుండా రైలులోనే షాపింగ్ చేసుకొనేలా పశ్చిమ, మధ్య రైల్వేలు యోచిస్తున్నాయి. పర్‌ఫ్యూమ్స్, బ్యాగ్స్, వాచీలు, ఇతర ప్రయాణ అవసరాల వస్తువులను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ప్రీమియమ్ రైళ్లలో ప్రవేశపెట్టి.. ఆతర్వాత లాంగ్-జర్నీ ట్రైన్స్‌లలో షాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. టికెట్ల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా 1200 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని అన్ని రైల్వే జోన్‌లకు రైల్వే మంత్రిత్వ శాఖ కోరిన పిమ్మట..పశ్చిమ, మధ్య రైల్వేలు ఈ ఆలోచన చేస్తున్నాయి.


ఇందులో భాగంగా.. పశ్చిమ, మధ్య రైల్వేలు సెప్టెంబర్‌లో టెండర్లను ఆహ్వానిస్తోంది. డిసెంబర్‌లో శతాబ్ది రైళ్లలో షాపింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పశ్చిమ  రైల్వే భావిస్తుండగా.. మధ్య రైల్వే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, ఎర్నాకుళం- హజరత్ నిజాముద్దీన్ దురంతో రైళ్లలోని ఏసీ కోచ్‌లలో అక్టోబర్‌లో రైలులోనే షాపింగ్ చేసుకొనే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.


'ప్రయాణీకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తే.. పైలెట్ ప్రాజెక్టు కింద అక్టోబర్‌లో రైలులోనే షాపింగ్ చేసుకొనే విధానాన్ని ప్రవేశపెట్టుతాం. మంచి నాణ్యమైన వస్తువులను ప్రయాణీకులకు అందిస్తాం. డిసెంబర్ నుంచి అన్ని ప్రీమియమ్ రైళ్లలో షాపింగ్ చేసుకోవచ్చు' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రైల్వే అధికారి తెలిపారు.


ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో సాధారణ బరువు యంత్రాలకు బదులు.. నాణెంతో పనిచేసే బాడీ మాస్ ఇండెక్స్ కియోస్క్స్‌ను ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాదు.. ఆదాయాన్ని పెంచుకోవడానికి రోబోటిక్ మసాజ్ చైర్స్, సబ్ అర్బన్ ట్రైన్స్‌ ట్రాక్ చేయడానికి మొబైల్ అప్లికేషన్స్, భారతదేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు వంటివి ఆలోచిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ