న్యూఢిల్లీ: శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ల ధరలను 25% వరకు తగ్గించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఏసి చైర్ కార్, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ సదుపాయం ఉన్న అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ పథకం వర్తించనున్నట్టు ఇండియన్ రైల్వే స్పష్టంచేసింది. గతేడాది 50% కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలోనే ఈ డిస్కౌంట్ స్కీమ్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. రోడ్డు రవాణా మార్గం, విమానాల టికెట్ల ధరలు దిగొస్తున్న క్రమంలోనూ ఇండియన్ రైల్వే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రయాణికులు ఆయా రైళ్లలో ప్రయాణించేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. 


రైల్వే శాఖ అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత కొంతకాలంగా శతాబ్ధి, గతిమన్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 50 శాతానికి మించిన సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఖాళీ సీట్లతో ప్రయాణం చేసి నష్టాలు మూటగట్టుకోవడం కన్నా.. ఆక్యుపెన్సీ పెంచి అన్ని సీట్లను భర్తీ చేయడమే ఉత్తమం అనే ఉద్దేశంతోనే రైల్వేశాఖ టిక్కెట్ల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమెర్షియల్ మేనేజర్స్‌కి ధరల తగ్గింపు నిర్ణయంపై రైల్వే శాఖ సమాచారం అందించింది.