చిన్నారులను రేప్‌ చేస్తే మరణశిక్ష/ఉరిశిక్ష విధించాలని కేంద్రమంత్రి వర్గం నిర్ణయించింది. శనివారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రి వర్గం ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా చిన్నారులు, మహిళలపై అత్యాచారాలపై పెరిగిపోతున్న నేపథ్యంలో..వాటికి అరికట్టేందుకు ప్రభుత్వం పొక్సో చట్టానికి సవరించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరగడం లేదు కనుక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం, 12 సంవత్సరాల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధిస్తారు. ఇదివరకు 12 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే అత్యల్ప శిక్ష ఇరవై ఏళ్లు కాగా దీనిని జీవిత ఖైదుగా, మరణశిక్షగా మార్చారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే అత్యల్ప శిక్షను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచడంతో పాటు జీవితకాల జైలు శిక్ష విధించే అవకాశముంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కనీస శిక్ష ఏడు నుంచి పదేళ్లకు పెంచడంతో పాటు జీవితశిక్షగా మార్చే వీలు కల్పించారు.


రేప్‌ కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే న్యాయవిచారణను కూడా రెండునెలల్లో ముగించాలి. అప్పీళ్లను సైతం ఆరునెలల్లోనే పరిష్కరించాలి. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి గానీ, గ్యాంగ్‌ రేప్‌ పాల్పడితే ముందస్తు బెయిల్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదు. బెయిల్‌పై నిర్ణయం తీసుకోవడానికి 15 రోజుల ముందు ప్రభుత్వ న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి నోటీసు ఇవ్వాలి.


రేప్‌ కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు


బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేస్తారు. అవసరమైన సిబ్బందిని నియమిస్తారు. పోలీస్‌ స్టేషన్లకు, ఆస్పత్రులకు ఫోరెన్సిక్‌ కిట్‌లను అందజేస్తారు. రేప్‌ కేసులు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి నిర్దిష్ట గడువులోపల దర్యాప్తు పూర్తిచేస్తారు. అత్యాచార కేసుల పరిశీలన కోసం అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తారు. మూడు నెలల్లో ప్రారంభించబోయే మిషన్‌మోడ్‌ ప్రాజెక్టులో ఇవన్నీ అంతర్భాగంగా ఉంటాయి. అత్యాచారాలకు పాల్పడే నేరస్థుల డాటాబేస్‌ను తయారుచేసి ఎప్పటికప్పుడు  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమాచారం పంచుకుంటారు. బాధితులకు సహాయంచేసేందుకు వన్‌స్టాప్‌ సెంటర్లను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తారు.


రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌లో మార్పులు


కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ పథకంలో మార్పులు చేర్పులు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలవుతున్న ఈ పథకానికి రాబోయే అయిదేళ్లలో 7255.5 కోట్లు ఖర్చు చేయ నున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 4500 కాగా, రాష్ట్రాల వాటా 2755.50కోట్లుగా ఉంటుంది. మౌలిక సదుపాయాల మెరుగు, ఇ-పాలనకు జవసత్వాలకు ఉపయోగపడే ఈ పథకాన్ని ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రారంభిస్తారు.