వాహనాన్ని వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ కు గురైతే.. అలాంటి ప్రమాదానికి బీమా వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దంది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.


2012లో దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీమా క్లెయిమ్‌ చేసుకోవడానికి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అజాగ్రత్త వల్లే దిలీప్‌ ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు త్రిపుర హైకోర్టును ఆశ్రయించగా.. కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల ఇన్స్యూరెన్స్‌ చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. స్వయం తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.  అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ‘పర్సనల్‌ యాక్సిడెంట్‌’ పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు వెల్లడించింది.