న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు రైలుగా గుర్తింపు పొందిన లక్నో - ఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయవంతం అవడంతో ఇక రేపటి నుంచి అహ్మెదాబాద్  నుంచి ముంబై మార్గం మధ్య రెండో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కలిసి అహ్మెదాబాద్-ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రేపు జనవరి 17 శుక్రవారం నాడు పచ్చజండా ఊపనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం అహ్మెదాబాద్-ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇనాగరల్ రన్ పూర్తిచేసుకోనుండగా జనవరి 19న శనివారం నుంచి అహ్మెదాబాద్-ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ రైల్లో టికెట్ బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ సేవలు సైతం ప్రారంభించారు. ఐఆర్‌సిటీసి అధికారిక వెబ్‌సైట్ (IRCTC official website) www.irctc.co.in పై ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సిటీసికి చెందిన అధికారిక మొబైల్ యాప్ ఐఆర్‌సిటీసి రైల్ కనెక్ట్ (Irctc Rail Connect)లో కూడా టికెట్స్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి..
అహ్మెదాబాద్-ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాలనుకునే వాళ్లు గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. అన్ని రైళ్ల టికెట్స్ తరహాలో ఈ రైలు టికెట్స్‌ని రైల్వే రిజర్వేషన్ కౌంటర్స్‌లో బుక్ చేసుకునే వీలు లేదు. కాకపోతే ఐఆర్‌సీటీసి అధికారిక ఏజెంట్స్ ద్వారా టికెట్ బుక్ చేయించుకోవచ్చునని ఐఆర్‌సిటీసి వెల్లడించింది. పేటీఎం, ఇగ్సిగో, ఫోన్‌పే, మేక్ మై ట్రిప్, గూగుల్, ఐబిబో, రైల్‌యాత్రి వంటి టికెట్ బుకింగ్ పార్ట్‌నర్స్ ద్వారా కూడా అహ్మెదాబాద్-ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్స్ బుక్ చేసుకునేందుకు వీలుంది. వారంలో ఒక్క గురువారం రోజు మినహాయించి మిగతా ఆరు రోజుల పాటు అహ్మెదాబాద్ - ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రైలు మెయింటెనెన్స్ కోసం గురువారం నాడు ఈ రైలు సేవలకు బ్రేక్ ఇచ్చారు. రైలులో ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా అన్నిరకాల హంగులతో ఈ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును తీర్చిదిద్దినట్టు ఐఆర్‌సీటీసి వర్గాలు జీ మీడియాకు తెలిపాయి. 


రైలు సామర్థ్యం.. షెడ్యూల్..   
పూర్తి ఏసి సౌకర్యంతో నడిచే ఈ రైలులో ఒక్కోదాంట్లో 56 సీట్ల కెపాసిటీతో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్స్, 78 సీట్ల సామర్థ్యంతో 8 చైర్ బోగీలు ఉన్నాయి. మొత్తం 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ రైలు అహ్మెదాబాద్ నుంచి నిత్యం ఉదయం 6.40కు బయల్దేరి మధ్యాహ్నం 1.10 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. మార్గం మధ్యలో నడియాడ్, వదొదర, భారుచ్, సూరత్, వాపి, బొరివలి రైల్వే స్టేషన్స్‌లో ఆగుతుంది. ముంబై నుంచి తిరిగి మధ్యాహ్నం 3.40 కి బయల్దేరి రాత్రి 9.55 గంటలకు అహ్మెదాబాద్‌కు చేరుకుంటుంది. మార్గం మధ్యలో నడియాడ్, వదొదర, భారుచ్, సూరత్, వాపి, బొరివలి రైల్వే స్టేషన్స్‌లో ఈ రైలుకు హాల్ట్స్ ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..