ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీని ప్రయోగించింది. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్ ‌(ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1) ను రూపొందించింది ఇస్రో. తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం మూడు దశలో విజయవంతం అయింది. కాని నాలుగో దశలో మాత్రం సిగ్నల్ మిస్సైంది. దీంతో సిగ్నల్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు. SSLV-D1 అన్ని దశలు అనుకున్నవిధంగానే పూర్తయ్యాయని.. టెర్మినల్‌ దశలో కొంత డేటా నష్టం జరిగిందని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ చెప్పారు. మిషన్‌ తుది ఫలితాన్ని నిర్ధారించడానికి  సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయా? లేదా? పరిశీలిస్తున్నామన్నారు ఇస్రో ఛైర్మన్‌.  ప్రయోగ పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం ఇస్తామని ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.



ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను ఎస్‌ఎస్‌ఎల్‌వీ  తనతో నింగిలోకి మోసుకెళ్లింది.  షార్‌ నుంచి ఇది 83వ ప్రయోగం. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటి ప్రయోగం. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1పొడవు 34 మీటర్లు. వెడల్పు 2 మీటర్లు.  120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో నింగిలోకి ప్రయోగించారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తైంది.ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు.మొదటి దశ127.5 సెకన్లలో పూర్తి కాగా.. రెండో దశ 336.9 సెకన్లలో పూర్తైంది.  రెండో దశలో 7.7 టన్నుల ఘన ఇంధనం ఉపయోగించారు.  మూడో దశలో  4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేశారు.ఆ తర్వాత సిగ్నల్ మిస్సైంది.


ఈవోఎస్‌ 02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని నిశితంగా పరిశీలిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు ఆజాదీశాట్‌ ను రూపొందించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. ఆజాదీశాట్‌ లైఫ్ టైమ్ ఆరు నెలలు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాడిన జాతీయ గీతం రికార్డ్‌ వెర్షన్‌ను ఇందులో అమర్చారు.


ఇస్రో ఇప్పటిదాకా ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు తయారుచేసేందుకు 600 మంది 70 రోజులు పట్టేది. చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు కేవలం 72 గంటల్లోనే రూపొందిస్తారు. ఇందుకయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లే.
ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1 అంతరిక్ష రంగం, ప్రైవేటు భారతీయ పరిశ్రమల మధ్య మరింత సహకారాన్ని సృష్టించనుందని చెబుతున్నారు.



 
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook