GSAT-6A కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగంతో తానేంటో నిరూపించుకున్న ఇస్త్రో
వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తోన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవాళ మరో విజయం సొంతం చేసుకుంది.
వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తోన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవాళ మరో విజయం సొంతం చేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఇస్త్రో చేపట్టిన జీశాట్-6ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం విజయవంతమైంది. గురువారం సాయంత్రం 4.56 గంటలకు రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. జీశాట్-6ఏ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను మోసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ-ఎఫ్08 వాహనం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన 17 నిమిషాల్లో 35,900 కి.మీ. దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్టయింది. ఈ శాటిలైట్ ప్రయోగంతో భారత సైన్యానికి కమ్యూనికేషన్ సర్వీసులు మరింత విస్తృతం కానున్నాయి. మొబైల్ కమ్యూనికేషన్ సేవల్లోనూ జీశాట్-6ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ కీలక పాత్ర పోషించనుంది.
415.6 టన్నుల బరువు, 49.1 మీటర్ల ఎత్తు కలిగిన GSLV-F08 అత్యధిక సామర్థ్యంగల వికాస్ ఇంజిన్, ఎలక్ట్రో-హైడ్రాలిక్ యాక్చువేషన్ సిస్టం స్థానంలో ఎలక్ట్రో మెకానికల్ యాక్చువేషన్ సిస్టమ్‌లను జోడించినట్టు ఇస్త్రో ప్రకటించింది. GSAT-6A ప్రయోగంతో దేశీయంగా కమ్యూనికేషన్ శాటిలైట్ల తయారీలోనూ తాము తీసిపోం అని ఇస్రో ప్రపంచానికి చాటిచెప్పింది. శాటిలైట్ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ, సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర ప్రముఖులు ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.