భద్రతాబలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
భద్రతాబలగాల కాల్పుల్లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఉగ్రవాది మరణించాడు.
భద్రతాబలగాల కాల్పుల్లో ఆదివారం తెల్లవారుఝామున ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్ బుద్గాం జిల్లాలోని అరిజాల్ గ్రామంలో చోటుచేసుకుంది. భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ తీవ్రవాది చనిపోయాడు. మరో మహిళకు గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
"తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో, జమ్మూకాశ్మీర్ పోలీసులు, 53 రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) దళాలు బుద్గాం జిల్లాలోని అరిజాల్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు" అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఓ ఇంట్లో దాక్కున్న మిలిటెంట్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భద్రతా దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక మహిళ గాయపడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిలిటెంట్ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలం నుంచి భద్రతాదళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయని అధికారి తెలిపారు.
కాగా.. అనంత్‌నాగ్ జిల్లాలోని దూరు ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మృతిచెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ ఆదివారం వరకు కొనసాగింది. ఎలాంటి నష్టం జరగకుండా ఉగ్రవాదుల ఏరివేత ముగిసింది.