న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి, మహిళా నాయకురాలు జయప్రద నేడు బీజేపీలో చేరారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురికాకముందు 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచిన జయప్రద లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, తాను రాంపూర్ నుంచి పోటీ చేయనున్నారా లేదా అనే విషయమై అటు జయప్రద కానీ లేదా ఇటు పార్టీ వర్గాలు కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీలో చేరిన సందర్భంగా జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోకి తనకు సాదర స్వాగతం పలికిన బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. సినీరంగమైనా, రాజకీయాల్లోనైనా.. తాను పూర్తి స్థాయిలో కృషిచేశానని జయప్రద చెప్పారు. గతంలో తాను టీడిపికి పనిచేశానని, ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీకి సేవ చేశానని, ఇక ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పనిచేసే అవకాశం దక్కిందని జయప్రద పేర్కొన్నారు. 


మూడో దశ ఎన్నికల్లో భాగంగా రాంపూర్‌ లోక్ సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. సమాజ్ వాదీ పార్టీలో వుండగానే పార్టీ నేత ఆజం ఖాన్ తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని జయప్రద ఆరోపించిన సంగతి తెలిసిందే. జయప్రదను పార్టీ నుంచి బహిష్కరించిన సమాజ్ వాదీ పార్టీ అధిష్టానం ఆమె స్థానంలోనే రాంపూర్ నుంచి ఆజం ఖాన్‌ను పోటీలో నిలిపారు. అయితే, తాజాగా తమ పార్టీలో చేరిన జయప్రదకు బీజేపీ రాంపూర్ లోక్ సభ టికెట్ కేటాయించి ఆమెను తన శత్రువుపైనే పోటీకి దింపుతారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఏ నిర్ణయం తీసుకునుందో వేచిచూడాల్సిందే మరి.