జియో ఫైబర్ ఉచిత కానుకలతో మల్టీప్లెక్సులు, డీటీహెచ్‌లకు నష్టం తప్పదా ?
జియో ఫైబర్ ఉచిత కానుకలతో మల్టీప్లెక్సులు, డీటీహెచ్‌లకు షాక్ తప్పదా ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలతో మల్టీప్లెక్సులు, డీటీహెచ్ సేవలు అందిస్తున్న వాణిజ్య సంస్థలకు షాక్ తప్పదా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. రిలయన్స్ జియో రాకతో అప్పటివరకు టెలికాం రంగంలో అగ్రగామిగా కొనసాగిన టెలికాం సంస్థల లాభాలు ఒక్కసారిగా కుప్పకూలడంతోపాటు భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. ఇక ఇప్పుడు జియో ఫైబర్ రాకతో మల్టీప్లెక్సులు, డీటీహెచ్ రంగంలో కొనసాగుతున్న వాణిజ్య సంస్థలకు అదే గతి తప్పదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జియో ఫైబర్ కనెక్షన్‌తో అతి తక్కువ ధరలోనే అంతరాయం లేకుండా 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రీమియం జియో ఫైబర్ వినియోగదారులకు కొత్త సినిమా విడుదలైన తొలిరోజే ఇంట్లో కూర్చునే టీవీల్లో సినిమా చూసే వీలు కల్పిస్తున్నట్టు అంబాని ప్రకటించడమే మల్టీప్లెక్సుల వ్యాపారానికి షాక్ తప్పదా అనడానికి ఓ కారణం. అంతేకాకుండా హై ఎండ్ ఆల్ట్రా-హై-డెఫినిషన్ టీవీ వంటి సెట్ టాప్ బాక్సు సేవలు, గేమింగ్ ప్రియులకు ఇష్టమైన గేమింగ్ కూడా అందుబాటులోకి రానుండటమే మల్టీప్లెక్సులు, డీటీహెచ్ వ్యాపారాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతరాయం లేని హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఓవర్-ది-టాప్(ఓటీటీ) సేవల ద్వారా కొత్త సినిమాలను ఇంట్లోంచే వీక్షించే వీలు కలగనుండటం మల్టీప్లెక్సులకు ఒకింత ప్రతికూలమైన అంశం కానుందనేది విశ్లేషకుల అభిప్రాయం.