మోదీ కన్నా వాజ్‌పేయి బెటర్: మెహబూబా ముఫ్తీ
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం నడపడం అంటే కత్తి మీద సాము లాంటి పని అని.. ఒకరకంగా వారితో కలిసి పనిచేయడం అంటే విషం తాగడంతో సమానమని అన్నారు
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం నడపడం అంటే కత్తి మీద సాము లాంటి పని అని.. ఒకరకంగా వారితో కలిసి పనిచేయడం అంటే విషం తాగడంతో సమానమని అన్నారు. వారితో కలిసి తాను రెండు సంవత్సరాల రెండు నెలలు ప్రభుత్వాన్ని నడిపానని.. కానీ ఆ ప్రభుత్వం వల్ల లెక్కలేనంత మానసిక క్షోభను అనుభవించానని ముఫ్తీ తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే మోదీ పాలన కన్నా.. వాజ్‌పేయి పాలన బాగుందని.. అందుకే ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూడా అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ముఫ్తీ తెలిపారు.
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేతైన ముఫ్తీ మాట్లాడుతూ తమ పార్టీలో చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పీడీపీ పార్టీ నుండి వైదొలగపోతే కేసులు బనాయిస్తామని బీజేపీ పీడీపీ ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని.. ఆ బెదిరింపుల్లో భాగంగా ఎన్‌ఐఏ రైడ్స్ జరుగుతున్నాయని ముఫ్తీ తెలిపారు. అలాగే బీజేపీ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా.. దేశంలో పలు పార్టీలు హార్స్ ట్రేడింగ్ మాదిరిగా సర్కారుని నడుపుతున్నాయని కూడా ముఫ్తీ పేర్కొన్నారు.
ఇలాంటి స్టేట్‌మెంటే ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేశారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీతో తాము పెట్టుకున్న పొత్తుపై తన అసహనాన్ని వెళ్లగక్కారు. "మీరందరూ మీ సోదరుడిలా భావించి సీఎం పీఠం కట్టబెట్టారు. కానీ నేను మనసు చంపుకొని పాలన చేస్తున్నాను. విషాన్ని దిగమింగుతూ పరిపాలన చేస్తున్నాను" అని తెలిపారు. ఏదేమైనా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలు పొత్తు పెట్టుకుంటే... మనస్పర్థలు పెంచుకోవడం తప్పితే జనాలకు ఒరిగేది ఏమీలేదని.. పాలనలో అస్థిరత పెరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.