జమ్ముకశ్మీర్‌ న్యాయస్థానానికి తొలిసారిగా ఓ మహిళ ప్రధాని న్యాయమూర్తి హోదాలో నియమితులయ్యారు. శనివారం జస్టిస్‌ గీతా మిత్తల్‌తో జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు.తద్వారా జమ్ముకశ్మీర్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన తొలి మహిళగా గీత వార్తల్లోకెక్కారు. హైకోర్టు జనరల్ నుండి ఇటీవలే గీతా మిత్తల్‌కు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించమని ఉత్తర్వులు అందాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గీతా మిత్తల్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గవర్నర్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. గీతా మిత్తల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ సతీమణి ఉషా వోహ్రా, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, పలువురు న్యాయవాదులు, హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు హాజరయ్యారు. ఢిల్లీ హైకోర్టులో అనేక సంవత్సరాలు సీనియర్ న్యాయవాదిగా సేవలందించిన గీతా మిత్తల్.. 2004లో అదే కోర్టులో అడిషనల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 


2018లో భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా గీతా మిత్తల్ నారీశక్తి పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే గతంలో పోప్ ఫ్రాన్సిస్ ఆహ్వానం మేరకు గీతా మిత్తల్ వాటికన్ సిటీకి వెళ్లి అంతర్జాతీయ న్యాయమూర్తుల సదస్సులో పాల్గొని.. మహిళల అక్రమ రవాణా అంశం మీద మాట్లాడారు. మానవ హక్కులు, మహిళా సాధికారిత, సామాజిక న్యాయం, మరణ శిక్ష, కార్పొరేట్ చట్టాలు మొదలైన అంశాల మీద గీతా మిత్తల్ పలు పరిశోధనాత్మక వ్యాసాలు కూడా రాశారు.