కృషితో నాస్తి దుర్భిక్ష్యం అనే నానుడి ఆమెను చూసే పుట్టిందేమో..! ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో చిన్నప్పటి నుండి సైన్స్ రంగం పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచుకున్న ఆమె భారతదేశమే గర్వించదగ్గ మేటి వ్యోమగామిగా ఎంపికైంది. ప్రతిష్టాత్మక నాసా కేంద్రంతో కలిసి పనిచేసింది. అంతరిక్ష యానం చేసిన తొలి భారత మహిళగా కూడా వార్తల్లోకెక్కింది. ఆమే కల్పనా చావ్లా. ఆమె జయంతి (మార్చి 17) సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం ప్రత్యేకం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించారు. ఆమె తండ్రి బనారసీలాల్ ఓ టైర్ల ఉద్యోగి. ఎంతో కష్టపడి పేదరికాన్ని ఎదిరించి మరీ వ్యాపార రంగంలోకి వచ్చారు. ఒక ఎంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయ్యారు.


*కల్పనా చావ్లాపై ఆమె తండ్రి ప్రభావం ఎంతో ఉంది. ఆమె చిన్నప్పుడు తన తోటి విద్యార్థినులతో పెద్దగా కలిసేవారు కాదు. ఆ వయసులో ఆడపిల్లలందరూ బార్బీ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే.. కల్పన మాత్రం విమానం బొమ్మలతో ఆడుకొనేవారు. కల్పన తండ్రి ఆమెను డాక్టరుగా చూడాలని భావించారట. అయితే ఆమె తనకు పైలట్ కావాలని ఉందని చెప్పడంతో ఆయన కాదనలేకపోయారు.


*కమర్షియల్ పైలట్ అవ్వాలని భావించిన కల్పన.. పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత  అమెరికా వెళ్లి అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి "ఏరోస్పేస్ ఇంజనీరింగు లో మాస్టర్స్ డిగ్రీని 1984లో పొందారు. ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా చేశారు.


*పీహెచ్‌డీ పూర్తి చేశాక.. 2000 మందితో పోటీపడి .. చాలా చిన్నవయసులోనే నాసా శాస్త్రవేత్తగా కల్పన ఎంపికవ్వడం విశేషం.


*1983లో విమానయానంపై ఎన్నో పుస్తకాలు రాసిన శాస్త్రవేత్త, సైన్స్ రైటర్ జీన్-పియర్ హారిసన్‌ను కల్పన వివాహం చేసుకున్నారు. 1990లో అమెరికా పౌరసత్వం పొందారు.


*1988లో కల్పన ఒక శాస్త్రవేత్తగా మారి.. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 


*1997లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా, తొలి ఆసియా మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడు ఆమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడపడం విశేషం. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు స్పేస్ షిప్ ద్వారా అంతరిక్ష యానం చేశారు ఆమె


*2003 జనవరిలో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజులు అక్కడ గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత అదే అంతరిక్ష యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా.. 2003 ఫిబ్రవరి 1 తేదిన కొలంబియా వ్యోమనౌక కూలిపోవడంతో కల్పనతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు దుర్మరణం పాలయ్యారు.


ప్రతీ సంవత్సరం కల్పనా చావ్లా గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం ఆమె పేరు మీద అవార్డులను బహుకరిస్తోంది. భారతదేశంలో శక్తిమంతమైన మహిళలను ఎంపిక చేసి వారికి ఈ పురస్కారాలను అందిస్తోంది.