నేడు కమల్ హాసన్ రాజకీయ పార్టీ ప్రారంభం
ప్రముఖ నటుడు కమల్ హాసన్ బుధవారం మదురైలో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ బుధవారం మదురైలో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు వరుస కార్యక్రమాలు తలపెట్టారు. ముందుగా రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నివాసాన్ని సందర్శించారు. అక్కడ కమల్ ను అభిమానులు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.
కమల్ హాసన్ రామేశ్వరం నుండి యాత్రను ప్రారంభించి, మదురైలో రాజకీయ పార్టీని ప్రారంభించాలని భావిస్తున్నారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటిని సందర్శించి, కలాం సోదరుడితో సంభాషించారు. ఆ తరువాత జాలర్లతో మాట్లాడుతారు. రామానాథపురం, మనమదురై, పరమకుడి ప్రాంతాల్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కమల్‌హాసన్ రాజకీయ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరుకానున్నారు. "మదురైలో సాయంత్రం జరగబోయే బహిరంగ సభకు కేజ్రీవాల్ హాజరవుతారు" అని కమల్ సన్నిహితులు స్పష్టం చేశారు. ఆప్ అధినేత క్రేజీవాల్ బహిరంగ సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. పార్టీ ప్రకటన తరువాత, కమల్ హాసన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు.