రజినీకాంత్, ఎం.కె. స్టాలిన్‌కు కమల్ హాసన్ చురకలు
రజినీకాంత్, ఎం.కె. స్టాలిన్‌పై కమల్ హాసన్ సెటైర్లు
చెన్నై: సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి మక్కల్ నీది మయ్యం అనే పార్టీ స్థాపించిన లోక నాయకుడు కమల్ హాసన్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నివిధాల సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తమిళ సూపర్ స్టార్ రజినికాంత్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. స్టాలిన్‌పై పరోక్షంగా వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ.. ''చినిగిన చొక్కాపై తాను వుండనని, ఒకవేళ అసెంబ్లీలో తన చొక్కా చిరిగినా.. తాను వేరే చొక్కా వేసుకుంటాను'' అని అన్నారు. పళనిస్వామి ప్రభుత్వం తమిళనాడు అసెంబ్లీ బల పరీక్ష ఎదుర్కున్న సందర్భంలో అసెంబ్లీలో జరిగిన ఘర్షణలో స్టాలిన్ చొక్కా చినిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టాలిన్ అదే చినిగన చొక్కాతో వెళ్లి రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం అప్పట్లో పతాకశీర్షికలకెక్కింది. అంతేకాకుండా.. ''తాను గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం మొదలుపెట్టిన తర్వాతే తన లాంటి చిన్నపిల్లాడిని చూసి గ్రామ సభలను కాపీ కొట్టడం హాస్యాస్పదం'' అని స్టాలిన్‌ను ఎద్దేవా చేశారు.
ఇదిలావుండగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మీరు పోటీచేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ''ఒకసారి ఒంటికి నూనె దట్టించుకుని రెజ్లింగ్‌లోకి దిగి తొడలు చరిచిన తర్వాత శత్రువుతో తలపడకుండానే రెజ్లింగ్ రింగ్‌లోంచి బయటికి వస్తే, అందరిలో నవ్వుల పాలవుతాం'' అని కమల్ హాసన్ చమత్కరించారు.