కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి సీక్రెట్ ఒప్పందం చేసుకున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. హెచ్ డీ దేవెగౌడ అధినేతగా ఉన్న జేడీఎస్, కాంగ్రెస్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. తరతరాలుగా పేదరిక నిర్మూలనే తమ ప్రధాన ఎజెండా అని చెప్పుకొనే కాంగ్రెస్, కర్ణాటకలో మాత్రం రైతులను, నిరుపేదలను పట్టించుకున్న పాపాన పోలేదని మోదీ ఆ పార్టీని తూర్పారపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రాజకీయ విశ్లేషకులు ఇచ్చే రిపోర్టులతో పాటు నమూనా పోల్స్ కూడా ఒకే మాట చెబుతున్నాయి. కాంగ్రెస్‌ను జేడీఎస్ ఓడించలేదనేది సత్యం. వారు కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. కర్ణాటకలో మార్పును తీసుకొని వచ్చే పార్టీ ఒక బీజేపీ మాత్రమే" అని మోదీ తెలిపారు. అయితే జేడీఎస్, కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నా ఆశ్చర్యపోలేమని మోదీ అన్నారు.


అయితే రాజకీయ విషయాలు ఎలా ఉన్నప్పటికీ తనకు జేడీఎస్ నేత దేవెగౌడ అంటే అపారమని గౌరవమని... ఆయన నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. కానీ జేడీఎస్ పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీలేదని అన్నారు. "కాంగ్రెస్ ఎప్పుడూ పేదల కోసమే పాటుపడే పార్టీ అనే చెప్పుకుంటుంది. అయితే ఓ పేదతల్లి కడుపున పుట్టిన బిడ్డ ప్రధాని అయితే మాత్రం సహించలేదు" అని మోదీ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని తుముకూరు లాంటి ప్రాంతాలు వనరులున్నా.. ఇంకా వెనుకబడడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వపు చేతకానితనమే అని మోదీ పేర్కొన్నారు.