తనని తాను అత్యాచార బాధితురాలితో పోల్చుకున్న కర్ణాటక స్పీకర్ !
తనని తాను అత్యాచార బాధితురాలితో పోల్చుకున్న కర్ణాటక స్పీకర్ !
బెంగళూరు: వివాదాస్పద ఆడియో టేప్స్ కేసు దర్యాప్తు వ్యవహారంలో తన పరిస్థితి ఓ అత్యాచార బాధితురాలిని తలపిస్తోందని చెబుతూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తనని తాను ఓ అత్యాచార బాధితురాలితో పోల్చుకున్నారు. అత్యాచారం కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలిని పదేపదే ఎలాగైతే ప్రశ్నిస్తారో.. ఈ ఆడియో టేప్స్ కేసు దర్యాప్తులోనూ తనపై అలాగే పదేపదే ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. కర్ణాటకలో జేడీ(ఎస్)-కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేసే కుట్రలో భాగంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఓ జేడీ(ఎస్) ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తాయిలాలతో ఊరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంచేత దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
బీఎస్ యెడ్యూరప్ప ఫోన్ చేసినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో టేప్స్‌లో తనను (స్పీకర్ రమేష్ కుమార్) కూడా రూ.50 కోట్లకు బుక్ చేసుకున్నారు అని ప్రస్తావించడాన్ని స్పీకర్ తీవ్రంగా ఖండించారు. తన పేరు అబాసుపాలు చేసేలా వున్న ఈ ఆడియో టేప్స్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేత విచారణ జరిపించాల్సిందిగా స్పీకర్ రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదాస్పద ఆడియో టేప్స్‌పై ముఖ్యమంత్రి కుమార స్వామి సిట్ దర్యాప్తునకు ఆదేశించారు.