బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటకలో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యాబలం రాకపోవడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటు కోసం కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా భుధవారం ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సీన్ ఢిల్లీకి మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. అర్థరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై అర్ధరాత్రి తర్వాత విచారణ ప్రారంభించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, గురువారం వేకువజామున 2 గంటలకు వాదనలు ప్రారంభమై దాదాపు ఆరు గంటల వరకు కొనసాగాయి. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రమాణ స్వీకారంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ప్రమాణసీకారాన్ని ఆపలేమంటూ.. కర్ణాటక గవర్నర్‌కు మే 15వ తేదీన యడ్యూరప్ప ఇచ్చిన లేఖను తమకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని అడిగిందని కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించిన న్యాయవాదులు తెలిపారు. వాదనలను తిరిగి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సుప్రీం కోర్టు విననుంది.



 



 


కాగా సుప్రీంకోర్టు ప్రమాణసీకారాన్ని ఆపలేమంటూ పేర్కొనడంతో యడ్యూరప్పకు ఊరట లభించింది. గురువారం ఉదయం 9:30 గంటలకు ఆయన రాజ్ భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు.