Hijab Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక కొత్త ప్రభుత్వం నిర్ణయమేంటి, ఏం జరగనుంది
Hijab Row: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదంపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాష్ట్రంలోని ఏకైక ముస్లిం మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి.
Hijab Row: కర్ణాటకలో ఎన్నికలకు ముందు రేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమికి హిజాబ్ వివాదం కూడా దోహదపడిందని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేసిన ప్రకటనలు ఇప్పుడు అమల్లోకి వస్తే హిజాబ్ అంశం ఏమోతుందనేది ఆసక్తి రేపుతోంది.
కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మహిళలు కళాశాలకు హిజాబ్ లేదా బుర్ఖా ధరించి రావడాన్ని అడ్డుకుంటూ భజరంగదళ్, విశ్వహిందూపరిషత్ వంటి బీజేపీ అనుబంధ సంస్థల విద్యార్ధులు పోటీగా కాషాయ కండువాలతో తరగతులకు హాజరయ్యారు. దీంతో వివాదం రేగింది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించి రావడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హిజాబ్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో మతపరమైన అంశాలకు తావులేదని స్పష్టం చేసింది. అక్కడ్నించి ఈ అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరింది.
కర్ణాటకలో హిజాబ్ అంశంపై చాలా చర్చలు జరిగాయి. ఎన్నికల్లో సైతం ఇదే అంశం చర్చకొచ్చింది. హిజాబ్ సహా అప్పటి ప్రభుత్వం తీసుకున్న మతపరమైన నిర్ణయాల్ని ఎత్తివేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైన మహిళా ముస్లిం ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా హిజాబ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని వెల్లడించారు.
ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కొలువు దీరడంతో హిజాబ్ సహా ఇతర మతపరమైన నిర్ణయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఆసక్తిగా మారింది. హిజాబ్ అంశంపై మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలనేది ఆలోచించుకుని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం దృష్టి ఎన్నికల్లో ఇచ్చిన 5 కీలక హామీలను నెరవేర్చడంలోనే ఉందన్నారు.
ఈ క్రమంలో కర్ణాటక విద్యాసంస్థల్లో మహిళలు మరోసారి హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యే పరిస్థితి వస్తుందా లేదా అనేది చర్చనీయాంశమౌతోంది. ఇప్పటికైతే ఏడాదిగా హిజాబ్ నిషేధం రాష్ట్రంలో అమలవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook