ఓట్ల కోసం నాగిన్ డ్యాన్స్ చేసిన మంత్రి గారు
ఓట్ల కోసం నాగిన్ డ్యాన్స్ చేసిన మంత్రి గారు
బెంగళూరు: కాదేది కవితకు అనర్హం అనేది పాత మాట కాగా కాదేది ఓటు అడగడానికి అనర్హం అనేది కొత్త మాట అన్నట్టుంది ఎన్నికల్లో పోటీచేస్తోన్న అభ్యర్థుల తీరు. అవును, హోటల్లో దోశలు వేయడం, సెలూన్‌లో హేర్ కటింగ్, షేవింగ్ చేయడం, రైతు బజార్‌లో వ్యాపారుల కూరగాయలు అమ్మిపెడుతున్నట్టు ఫోటోలకు ఫోజివ్వడం వంటివన్నీ ఇప్పటివరకు చూసిన ఎన్నికల సిత్రాలు. ఇదిలావుంటే ఇవాళ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ మంత్రిగారు ఓట్లు వేయమని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ వ్యవహరించిన తీరు చూపరులను అవాక్కయ్యేలా చేసింది.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ఎంటిబి నాగరాజ్ ఉన్నట్టుండి నాగిన్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. పెళ్లి ఊరేగింపులో నాగిన్ డ్యాన్స్ చేసినట్టుగా మంత్రిగారు చేసిన పర్‌ఫార్మెన్స్ చూసిన జనానికి అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. కర్ణాటకలోని హోస్కోట్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.