బెంగళూరు: కర్ణాటకలో మరో నాలుగు రోజుల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాన పోటీ బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్యే ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయి. దీనిపై స్పందించిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో తాము కీలక పాత్ర వహిస్తామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు తమ పార్టీని గెలిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పందించారు.


ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీపై చంద్రబాబు అసహనంగా ఉండటం, అటు కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఉండబోతుండటంతో కర్ణాటకలో తెలుగు సెటిలర్ల ఓట్ల విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు మద్దతు తమకు ఉంటుందని దేవెగౌడ భావిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలో ప్రధాన పార్టీలు. కావున సహజంగానే తెలుగు రాష్ట్రాల సీఎంల మద్దతు తమకు ఉంటుందని దేవెగౌడ భావిస్తున్నారు. ఈ నెల 12న కర్ణాటకలో ఒకే దశలో పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు మే 15న వెల్లడికానున్నాయి.