కర్ణాటక ఎన్నికలు 2018: బెంగళూరులో కలకలం.. 10 వేల ఓటర్ కార్డులు సీజ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట నకిలీ ఓటరు కార్డులు సంచలనం సృష్టించాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట నకిలీ ఓటరు కార్డులు సంచలనం సృష్టించాయి. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరుగుతుండగా.. బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో పెట్టెల్లో గుట్టలకొద్దీ ఓటరు గుర్తింపు కార్డులు బయటపడ్డాయి. దీంతో పోలీసు యంత్రాంగం, ఈసీ అప్రమతం అయ్యింది. వెంటనే చర్యలు చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఎన్నికల సంఘం దాడులు చేసి 10 వేల నకిలీ ఓటరు కార్డులను సీజ్ చేసుకుంది. వేలకొద్దీ ఓటర్ ఐడీ కార్డులు, అప్లికేషన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఓ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐడీ కార్డులన్నీ బెంగళూరు లోని రాజరాజేశ్వరి నగర్(ఆర్‌ఆర్ నగర్) నియోజకవర్గానికి చెందినవిగా అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి 24 గంటల్లోగా అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి సంజీవ్ కుమార్ మీడియాకు చెప్పారు.
కాగా.. నకిలీ ఓటరు కార్డుల వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నకిలీ ఓటరు కార్డుల విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర మంత్రి అనంత కుమార్ ఆర్‌ఆర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికను నిలిపేయాలని ఈసీని కోరగా, మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. ఆర్‌ఆర్ నగర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. ఓటర్ ఐడీ కార్డుల వ్యవహారంలో తమ నేతల ప్రమేయం లేదన్న కాంగ్రెస్.. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు నీచ రాజకీయాలాడుతోందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఇలా ఉండగా చిత్రదుర్గలో గాలి అనుచరుడు శ్రీరాములు బంధువుల నివాసాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.