కాశ్మీర్‌లో వరదల ప్రభావం వల్ల అమర్‌‌నాథ్ యాత్రికులను సందర్శనకు పోలీసులు నిరాకరిస్తున్నారు. వాతావరణం సరిగ్గా లేనందున ఆ ప్రాంతానికి వస్తున్న యాత్రికులను బేస్ క్యాంపుల వద్దే ఉండాలని... దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణ ప్రభావం వల్ల ఎలాంటి ప్రమాద ఘటనలు కూడా జరగలేదని.. యాత్రికులు అందరూ సురక్షితంగానే ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా, జమ్ము కాశ్మీరులో వరదల ఉదృతి పెరిగే అవకాశం ఉన్నందున అక్కడి స్కూళ్లను కొన్ని రోజుల పాటు మూసివేయాలని.. అలాగే జనాలు ఎవరూ బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతానికి  అనంతనాగ్ జిల్లా దగ్గర జీలమ్ నదీ ప్రవాహం 21 అడుగులకు చేరడంతో కాశ్మీర్ పోలీసులు ప్రమాద ఘంటికను మోగించారు. 


అలాగే ఈ రోజు ఉదయం 8.30 గంటలకు జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో 12.6 ఎంఎంగా వర్షపాతం నమోదైంది. పోలీసులు ఇప్పటికే సాధారణ పౌరుల కోసం వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ సదుపాయం కల్పించారు. ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు జరిగినా.. సహాయక చర్యలు అవసరమైనా 9596777669 లేదా 9419051940 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.