ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ వినూత్న పథకానికి నాంది పలికారు. ఢిల్లీలో "ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన" పథకాన్ని ప్రారంభించిన ఆయన ఇక నుండి తీర్థయాత్రలు చేయాలని భావించే సీనియర్ సిటిజన్స్ దరఖాస్తు చేసుకొంటే.. వారి యాత్ర ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. దాదాపు 77,000 యాత్రికులకు ఈ పథకాన్ని అందుబాటులోకి తాము తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

60 ఏళ్లు దాటిన ఢిల్లీ వాసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకం ద్వారా యాత్రలకు వెళ్లాలని భావించేవారు కచ్చితంగా తమతో పాటు ఓ సహాయకుడిని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ సహాయకుడికి కనీసం 18 సంవత్సరాలు  నిండాలి. ఆ సహాయకుడి ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ఈ ఉచిత తీర్థయాత్రల స్కీమ్ పలు ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది.


ఢిల్లీ, మధుర, బృందావన్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, హరిద్వార్, రిషికేష్, నీలకంఠ్, అజ్మీర్, పుష్కర్, ఆనందపూర్ సాహిబ్, వైష్ణో దేవి.. ఈ యాత్రా స్థలాలన్నీ ఈ పథకం ద్వారా కవర్ చేయవచ్చు. 


ఈ యాత్రా పథకం ద్వారా ప్రయాణించేవారికి రూ.1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రయాణించే యాత్రికులకు ఏసీ బస్సు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనే వ్యక్తి ఢిల్లీ వాసే అయి ఉండాలని, అలాగే లోకల్ ఎమ్మెల్యే సిఫార్సు చేయాల్సి ఉంటుందని కూడా ఈ యాత్ర పథకానికి సంబంధించిన నిబంధనలు  చెబుతున్నాయి.