కేరళలోని ఓ నిరుపేద యువకుడు, రైల్వే కూలీ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఎర్నాకులం రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేసే శ్రీనాథ్ అనే యువకుడు రైల్వే వైఫై సహాయంతో సివిల్స్ పరీక్షలు రాసి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. ఆన్‌లైన్ ద్వారా శిక్షణ క్లాసులు తీసుకోవచ్చని తోటి స్నేహితులు సూచించగా రైల్వే వైఫైను వాడుకున్నానని.. దీంతో పని చేస్తూనే మొబైల్‌లోనే క్లాసులు విని పరీక్షలకు సన్నద్ధమైనట్లు శ్రీనాథ్ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నేను మూడుసార్లు పరీక్ష రాశాను. స్టేషన్ వైఫైని ఉపయోగించడం నేను ఇదే మొదటిసారి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లగేజీ మోసుకుంటూ క్లాసులు వినేవాడిని. ఇలాగా నేను పనిచేస్తూనే చదువుతాను. నాకు ఖాళీ సమయం దొరికినప్పుడు అంటే రాత్రి అన్నీ గుర్తుకు తెచ్చుకుంటాను." అని శ్రీనాథ్ చెప్పాడు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాలో భాగంగా 2016లో రైల్వే స్టేషన్‌లలో వైఫై సేవలను ప్రారంభించారు. మే 2018 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 685 రైల్వే స్టేషన్లు వైఫై సేవలను కలిగి ఉన్నాయి. భారతీయ రైల్వే 2019 మార్చి నాటికి 8,500 స్టేషన్లలో వైఫై సదుపాయాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం రూ.700 కోట్లు ఖర్చు కానున్నాయి.


శ్రీనాథ్ కేరళలోని మున్నార్‌కు చెందినవాడు. 'నేను నా కుటుంబాన్ని నడిపించాలి. అందుకోసం నేను చదువుతూనే ఉంటాను. ఒక మంచి ఉద్యోగం సంపాదించే వరకు పరీక్షలను రాస్తూనే ఉంటాను' అని శ్రీనాథ్ చెప్పాడు. ఇటీవలే భారతీయ రైల్వే ప్రకటించిన 62,000 గ్రూప్ డీ పోస్టులు-ట్రాక్ మాన్, కేబిన్ మెన్, లెవర్ మాన్, పాయింట్స్ మాన్, గ్యాంగ్ మెన్ మరియు ఇతర పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పాడు.