వరద బీభత్సం మిగిల్చిన విషాదం నుంచి ఇంకా తేరుకోని కేరళ ప్రజలను మరో గండం వెంటాడుతోంది. కేరళలో వరదల్లో సర్వం కోల్పోయి సహాయ శిబిరాల్లో తల దాచుకుంటున్న లక్షలాది మంది బాధితులను ఇప్పుడు ర్యాట్ ఫీవర్ వణికిస్తోంది. తాజాగా అక్కడి అధికారవర్గాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటికే దాదాపు 200 మందికిపైగా బాధితులు ర్యాట్ ఫీవర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నీళ్లలోకి దిగి ముమ్మరంగా సహాయచర్యల్లో పాల్గొంటున్న వారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం అధికంగా ఉండటం మరింత ఇబ్బందికరమైన పరిణామాలకు దారితీస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడి 19మంది మృతి చెందారనే వార్తలు కేరళ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వరద నీటిలో జంతువుల మూత్రం కలవడమే ఈ ర్యాట్ ఫీవర్ బ్యాక్టీరియా వ్యాపించడానికి కారణం అని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి భయపడాల్సింది ఏమీ లేదని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రభుత్వం వ్యాధి నివారణ చర్యలు తీసుకుంటోందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ బాధితులకు భరోసా ఇచ్చారు.  


అధిక జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పి, అధిక రక్తస్రావం, వాంతులు వంటివి ర్యాట్ ఫీవర్ లక్షణాలని, అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తూ కేరళ ప్రభుత్వం ఓ ప్రకటన జారీచేసింది. ఈ  సందర్భంగా ర్యాట్ ఫీవర్ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను సైతం అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు వివరించారు.