చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్ ..  కేరళలో వణుకుపుట్టిస్తోంది.  భారత్‌లో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా..అవి మూడు కేరళలోనే ఉండడం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు వైద్య ఆరోగ్య శాఖతోపాటు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్‌ను రాష్ట్ర విపత్తుగా  ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.కే శైలజ ప్రకటించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేస్తున్నామని ఆమె చెప్పారు. అంతే కాదు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనుమానం ఉన్న వారికి వెంటనే వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం కేరళ అంతటా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఐతే ఎవరూ భయపడవద్దని .. ముగ్గురు కరోనా వైరస్ రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఐతే కేరళకు చెందిన చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ చైనాలో ఉన్నారని .. వారు త్వరలోనే తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. అందుకోసమే రాష్ట్ర విపత్తుగా కరోనా వైరస్‌ను  ప్రకటించినట్లు ఆమె తెలిపారు. 


425కు చేరిన చైనా మృతుల సంఖ్య 
మరోవైపు కరోనా వైరస్ చైనాలో మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిన్న 361 మందిగా ఉన్న మృతుల సంఖ్య నేటికి 425కు పెరిగింది. దీంతో చైనా అంతటా ఉద్రిక్త వాతావరణం ఉంది. చైనాలోని ఆస్పత్రుల్లో దాదాపు 20 వేల 438 మంది కరోనా వైరస్ లక్షణాలతో చేరినట్లు తెలుస్తోంది. వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నా ..ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.