Kerala Night curfew: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు (Omicron Cases) క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఆదిలోనే ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. ఇందుకోసం ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూని అమలుచేస్తున్నాయి. తాజాగా కేరళ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. నేటి (డిసెంబర్ 30) నుంచి జనవరి 2 వరకు కేరళలో రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ వ్యాప్తంగా (Kerala) రాత్రి 10గం. నుంచి తెల్లవారుజామున 5గం. వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలులో ఉండే నాలుగు రోజుల పాటు అన్ని రకాల సంస్థలు, హోటల్స్, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్, థియేటర్లు రాత్రి 10గంటలకే మూసివేయాల్సి ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో మతపరమైన, రాజకీయ, సామాజికపరమైన ఈవెంట్స్‌పై కూడా నిషేధం ఉంటుంది. 


కేరళలోని బీచ్‌లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. రాత్రి పూట రోడ్లపై పోలీసుల నిఘా ఉంటుంది. అనవసరంగా రోడ్లపై తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నిర్వహించే ఈవెంట్స్‌లో జనం పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉండటంతో... కేరళ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని అమలులోకి తెచ్చింది. తద్వారా బహిరంగ సెలబ్రేషన్స్‌కు బ్రేక్ వేసినట్లయింది. 


ఇక కేరళలో ఇప్పటివరకూ 64 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బుధవారం (డిసెంబర్ 29) కొత్తగా 2846 కోవిడ్ కేసులు నమోదవగా... మరో 211 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల (Covid 19 cases) సంఖ్య 52,30,249కి చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకూ 47,277 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,456 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.


Also Read: Chittoor Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ముగ్గురికి సీరియస్