ఒక్క రోజు రైతుగా జీవించిన ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రైతుగా ఒక రోజు జీవించి...తనకు కర్షకుల మీద ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రైతుగా ఒక రోజు జీవించి...తనకు కర్షకుల మీద ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. తానే స్వయంగా పొలంలో దిగి వరినాట్లు వేసిన కుమారస్వామి.. తానూ రైతుబిడ్డనేనని గర్వంగా చెప్పుకున్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షపాతేనని ఈ సందర్భంగా కుమరస్వామి సందేశం ఇచ్చారు. శనివారం మండ్య జిల్లాలోని పల్లె ప్రాంతాలలో పర్యటించిన కుమారస్వామి సీతాపురం శివార్లలో ఉన్న పొలాల్లో ఈ రోజు సాధారణ రైతుకూలీగా పనిచేశారు.
అక్కడ పనిచేస్తున్న రైతులతో కలిసి వరినాట్లు వేశారు. అలాగే మధ్యాహ్నం రైతులతోనే కలిసి చదన్నం తిన్నారు. రైతులు వేసే ప్రతీ పంటకు కూడా గిట్టుబాటు ధర దక్కాలని తెలిపిన కుమారస్వామి వర్షాలు ఎలా పడుతున్నాయి అని.. ఎలాంటి పంటలు వేస్తున్నారని సీతాపురం రైతులను అడిగారు. సీఎంతో పాటు కలిసి వరినాట్లు వేసిన కార్యక్రమంలో అనేకమంది జేడీయూ కార్యకర్తలు కూడా పాలుపంచుకున్నారు.
తాను ఎప్పుడూ రైతులకు సహాయం చేయడానికి, సేవ చేయడానికి అందుబాటులోనే ఉంటానని కుమారస్వామి రైతులతో అన్నారు. ‘నేను కూడా రైతు బిడ్డనే. నా తండ్రి దేవెగౌడ కూడా రైతే. రైతు కుటుంబాలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాయో నేను స్వయంగా చూశాను. నాకు కూడా దుక్కి దున్నిన అనుభవం ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు మీతో కలిసి వరినాట్లు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ’ అని కుమారస్వామి అన్నారు. రాబోయే రెండు నెలలలో తాను కర్ణాటకలోని అన్ని జిల్లాలలో పర్యటించి .. రైతులతో కలిసి మాట్లాడి అభిప్రాయ సేకరణ చేస్తానని ఈ సందర్భంగా కుమారస్వామి అన్నారు.