జీ న్యూస్ ప్రత్యేకం: దాణా కుంభకోణం పూర్వాపరాలు
లాలూను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనతో పాటు మరో 15 మందిని కోర్టు దోషులుగా పేర్కొంటూ జనవరి 3, 2018న శిక్ష ఖరారు చేయనుంది.
దాణా కుంభకోణం విషయంలో దేవ్ఘర్ (ప్రస్తుతం జార్ఖండ్ లో ఉంది) ప్రభుత్వ ఖజానా నుంచి రూ.89 లక్షలు విత్ డ్రా చేసిన విషయమై నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. లాలూను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనతో పాటు మరో 15 మందిని కోర్టు దోషులుగా పేర్కొంటూ జనవరి 3, 2018న శిక్ష ఖరారు చేయనుంది. లాలూతో సహా వారందరినీ రాంచీ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసులో సంబంధం ఉన్న జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా తేల్చింది కోర్టు.
కేసు పూర్వాపరాలు
1993-94 మధ్యలో దేవ్ఘడ్ ప్రభుత్వ ఖజానా నుంచి రూ.89 లక్షలు విత్ డ్రా చేశారు. దాణా కొనుగోలు చేయటానికి అని చెప్పారు. బీహార్ పశుసంవర్ధక శాఖ ఈ డబ్బులను డ్రా చేసింది. ఈ కేసులో మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా తో సహా 31 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు. లాలూ ముఖ్యమంత్రిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో 900 కోట్ల రూపాయలను దాణా కోసం విత్ డ్రా చేశారు. అధికశాతం నిధులను ఫేక్ కంపెనీలకు మళ్లించారు. లాలూ, తదితరులు నిందితులుగా ఉన్న ఈ కేసును గత మే నెలలో మళ్లీ సుప్రీంకోర్టు బయటకు లాగింది.
1996లో దాణా కుంభకోణం మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ కుంభకోణం దేశంలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. 1998లో 38మందిపై చార్జిషీట్ నమోదైంది. లాలూ పేరు కూడా చార్జిషీట్ లో పేర్కొనడంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. భార్య రబ్రీదేవిని బీహార్ ముఖ్యమంత్రిగా నియమించారు. 1997లో లాలూ, జనతాదళ్ నుండి విడిపోయి రాష్ట్రీయ జనతాదళ్ అనే సొంత కుంపటి పెట్టుకున్నారు.
ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో కేసుతో సంబంధం ఉన్న 11 మంది మృతిచెందారు. ముగ్గురు అప్రూవర్లుగా మారారు. 2006-07లో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించడంతో వారికి శిక్ష విధించారు. దాణా కేసులో మొత్తం 64 విడివిడి కేసులు ఉన్నాయి. వీటిలో 53 కేసులు రాంచీలోని కోర్టులో విచారణ సాగింది. మొత్తం 64 కేసులుంటే.. అందులో లాలూ ప్రసాద్ యాదవ్ 5 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
లాలూ జైలుకెళ్లడం ఇదే తొలిసారి కాదు. ఇదే తరహాలో మరో గడ్డి కుంభకోణం చైబస ట్రెజరీ కేసులో జైలు శిక్ష అనుభవించారు. అయితే బెయిల్ పై బయటికొచ్చారు. ఈ కారణం చేత ఆయన లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి అనర్హుడయ్యాడు. 1990 లో జరిగిన ఈ గడ్డి కుంభకోణంలో 37.7 కోట్ల రూపాయలను అక్రమంగా కాజేశారని ఆయనపై కేసు నమోదైంది.
నేర చరిత్ర
లాలూకు ఇదివరకే చైబాసా ట్రెజరీ నుంచి రూ.37 కోట్లు విత్ డ్రా చేసినందుకు ఆయనతో సహా మరో 44 మంది నిందితులకు సెప్టెంబరు 30, 2013న రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అనేక మంది రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులను ఈ కేసులో దోషులుగా నిర్ధారించింది కోర్టు. తీర్పు వెల్లడైన వెంటనే, లలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో ఉన్న బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. శిక్ష కారణంగా, యాదవ్ ఎంపీ పదవికి అనర్హుడయ్యాడు. ఒకవిధంగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత వేటు పడింది. అప్పుడు లాలూకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించారు. శిక్ష ఖరారైన రెండున్న నెలల తరువాత, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాక బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు లాలూ. మళ్లీ లాలూను ఇప్పుడు అదే జైలుకు తరలించారు.