గిర్: వాస్తవానికి సింహానికి, చిరుతపులికి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనేంత వైరం ఉంటుంది. ఒకదానినొకటి బద్ధ శత్రువులుగా భావిస్తాయి. అడవిలో ఒకదానికొకటి ఎదురైతే అక్కడ ఇక యుద్ధమే జరుగుతుంది. కానీ గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలో వున్న గిర్ అడవుల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ అరుదైన సీన్ కనిపించింది. జాతివైరాన్ని మరిచి ఓ చిరుతపులి పిల్లను తన రెండు పిల్లలతో సమానంగా దగ్గరకు తీసుకుంటున్న ఓ ఆడ సింహం.. తన పిల్లలతో సమానంగా దానిని కూడా చూసుకోవడం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 


గత కొద్ది రోజులుగా చిరుతపులి పిల్ల ఆ సింహంతోనే తిరుగుతుండగా ఆ సింహం సైతం చిరుత పిల్లను తల్లిలా పాలిస్తూ, ఇతర జంతువుల నుంచి సంరక్షిస్తోందని, దీని వెనుకున్న కారణాలు ఏంటో తమకు కూడా ఇంకా తెలియరాలేదని గిర్ ఫారెస్ట్ (వెస్ట్) డిప్యూటి కన్జర్వేటర్ డా. ధీరజ్ మిట్టల్ తెలిపారు.