Cable Bridge Collapsed: కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 60 దాటిన మృతుల సంఖ్య
Gujarat Cable Bridge Collapsed: గుజరాత్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మోర్బిలో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో సుమారు 500 మంది వరకు సందర్శకులు బ్రిడ్జిపై ఉన్నట్టు తెలుస్తోంది.
Cable Bridge Collapsed in Gujarat: గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 100 దాటిందని గుజరాత్ ప్రభుత్వం స్పష్టంచేసింది. నీళ్లలో పడిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు నదిలోంచి బయటికి రక్షించి తీసుకొస్తున్నారు. అందులో కొంతమంది అప్పటికే స్పృహ కోల్పోగా ఇంకొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మచ్చు నదిపై మణి మందిర్ సమీపంలో ఈ తీగల వంతెన నిర్మించారు. ఆరు నెలల క్రితమే మరమ్మతుల కోసం మూసేసిన ఈ కేబుల్ బ్రిడ్జిని మరమ్మతుల అనంతరం ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. వారం కూడా గడవక ముందే తొలి వారాంతంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Latest Updates
Cable Bridge Tragedy Death Toll: ఘోర ప్రమాదంలో 100 దాటిన మృతుల సంఖ్య:
కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం తెల్లవారుజాము సమయానికి మొత్తం మృతుల సంఖ్య 100 పైనే దాటినట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. 177 మందిని సురక్షితంగా రక్షించగా మరో 19 మంది మోర్బి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.60 మందికిపైనే చనిపోయినట్టు ధృవీకరించిన మంత్రి
వేళ్లాడే వంతెన కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 60 కి పైనే ఉందని గుజరాత్ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి బ్రిజేష్ మేర్జా తెలిపారు.గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రత్యక్షసాక్ష్యులు ఏం చెబుతున్నారంటే..
గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానికులు ఏం చెబుతున్నారంటే.. దీపావళి పండగకు తోడు వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారని, బ్రిడ్జి కెపాసిటీకి మించి వందల సంఖ్యలో పర్యాటకులు ఒకేసారి బ్రిడ్జిపైకి చేరుకోవడంతో అధిక బరువు కారణంగానే వంతెన కూలిందని స్థానికులు, ప్రత్యక్షసాక్షులు సుక్‌రామ్, అమిత్ పటేల్ తెలిపారు.ఆ తర్వాత కొద్దిసేపటికే గుజరాత్ మంత్రి బ్రిజేష్ మేర్జా స్పందిస్తూ.. కేబుల్ బ్రిడ్జి కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 35 కి పెరిగినట్టు తెలిపారు.
స్పందించిన గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి
అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఏడుగురు చనిపోయినట్టు ప్రకటించిన గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి.
గుజరాత్ హోం మంత్రికి అమిత్ షా ఆదేశాలు
గుజరాత్‌లోని మోర్బిలో మచ్చు నదిపై వేళ్లాడే వంతెన కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవికి ఆదేశాలు జారీచేశారు. స్వయంగా మోర్బికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా అమిత్ షా సూచించారు.ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50 వేలు నష్టపరిహారం అందించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ... ఘటనా స్థలంలో బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు వేగవంతం చేసి ప్రాణనష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.