ఆ రెండు అంశాలపై లోక్ సభలో నిరసనలు.. సభ రేపటికి వాయిదా..
నిరసనల మధ్య రేపటికి వాదా పడిన లోక్ సభ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. రఫేల్ డీల్‌పై విచారణ అవసరం లేదని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పు అంశానికి తోడు 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తావనకొచ్చాయి. ఈ రెండు తీర్పులపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తంచేయగా మరోవైపు రఫేల్ డీల్‌పై లేనిపోని ఆరోపణలు చేసి ప్రధాని మోదీని అవమానించిన రాహుల్ గాంధీ, మోదీకి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. ఈ వాదోపవాదనల మధ్య 11 గంటల ప్రాంతంలో లోక్ సభను 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే, వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. దీంతో రేపు బుధవారం ఉదయం 11 గంటల వరకు సమావేశాలను వాయిదా వేస్తూ స్పీకర్ మరోసారి ప్రకటన చేశారు.
ఇదిలావుంటే, మరోవైపు ఉద్యోగాలు, నిరుద్యోగం అంశంపై చర్చ చేపట్టాల్సిందిగా 267 రూల్ ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో నోటీసు ఇచ్చింది.