కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో బీజేపి అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో సందర్భంగా చెలరేగిన హింసాకాండ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 19న జరగనున్న లోక్ సభ చివరి 7వ విడత పోలింగ్‌కి ముందుగా షెడ్యూల్ ప్రకారం ముగించాల్సి వున్న ఎన్నికల ప్రచారాన్ని మరో 24 గంటలకు కుచిస్తూ మే 16 గురువారం రాత్రి 10 గంటలకే ముగించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. 


చివరి విడత పోలింగ్‌లో బెంగాల్‌లో మొత్తం 9 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆయా నియోజకవర్గాలన్నింటిలోనూ గురువారం రాత్రి 10 గంటల నుంచే ప్రచారం నిలిచిపోనుంది. ఎన్నికలకు ముందు ఈ తరహాలో ఆర్టికల్ 324ను కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేయడం ఇదే మొదటిసారి. ఇదేకాకుండా ఎన్నికలకు కోల్‌కతాలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో నగర కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించిన ఎన్నికల సంఘం.. ఆయనను హోంశాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టంచేసింది.