సామాన్యులపై మరో భారం పడింది. ఇప్పటికే డీజిల్‌, పెట్రోలు ధరలను పెంచుతూ సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న చమురు కంపెనీలు.. తాజాగా సబ్సిడీ గ్యాస్‌ ధరను పెంచాయి. సబ్సిడిపై ఇచ్చే వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.2.71 మేర ధర పెంచుతూ కంపెనీలు నిర్ణయించాయి. పెరిగిన  ధర జులై 1 నుంచే అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరల నేపథ్యంలో.. ప్రతి నెల జరిగే ఆయిల్ ధరల మార్పులో భాగంగా ఈ పెరుగుదల చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి విలువ బలహీనపడటం, వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)లో సవరణ ఇందుకు మరో కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటి అవసరాలకు ఉపయోగించే రాయితీరహిత సిలిండర్ల సవరణ ధరపై జీఎస్టీ పెరిగినందువల్ల ధర పెంచాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సబ్సిడి గ్యాస్‌ సిలెండర్‌ ధర న్యూఢిల్లీలో ఆదివారం నుండి రూ.493.55లు కానున్నదని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసి) జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సబ్సిడీలేని సిలిండరు ధర రూ.55.50 మేర పెరిగింది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు వారి బ్యాంకు అకౌంట్‌లో జమయ్యే రాయితీ సొమ్మును పెంచనున్నట్టు తెలిపింది.


ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్‌ ధరలను ఆయిల్‌ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. సగటు నిర్థిష్ట ధర, గత నెలలో విదేశీ మారకపు రేటు ఆధారంగా ధరలను సమీక్షిస్తాయి.