కేబినెట్ పంపకాల కోసం శరద్ పవార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా నూతనంగా ఏర్పడనున్న కేబినెట్‌లో పోర్ట్ ఫోలియోల పంపకాల కోసం కాంగ్రెస్ నేతలు శరద్ పవార్‌ని కలిశారు.
ముంబై: మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా నూతనంగా ఏర్పడనున్న కేబినెట్‌లో పోర్ట్ ఫోలియోల పంపకాల కోసం కాంగ్రెస్ నేతలు శరద్ పవార్‌ని కలిశారు. నవంబర్ 28న శివాజీ పార్క్‌లో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండగా కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ తోరట్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం అందుతోంది. మూడు పార్టీలు కలిసి పంచుకుంటున్న అధికారం కావడంతో కేబినెట్‌లో ఏయే పార్టీకి ఎన్నిస్థానాలు దక్కనున్నాయి ? అందులో ఎవరెవరికి ఏయే పోర్ట్‌ఫోలియోలు కేటాయించనున్నారనే విషయాలు చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అహ్మెద్ పటేల్, కేసి వేణుగోపాల్, మల్లిఖార్జున ఖర్గె కొద్దిసేపటి క్రితమే శరద్ పవార్ నివాసమైన సిల్వర్ ఓక్‌కి చేరుకున్నారు. పృధ్వీరాజ్ చవాన్, బాలాసాహెబ్ తోరట్ సైతం శరద్ పవార్ నివాసానికి వచ్చారు.
ఇదిలావుంటే, మహారాష్ట్రలో తాము అధికారంలోకి వస్తామని చెప్పినప్పుడు జనం అపహాస్యం చేశారు. కానీ మహారాష్ట్రలో మేమే అధికారంలోకి రాబోతున్నాం. అలాగే శివ సేన ఢిల్లీలోనూ అధికారంలోకొచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని శివ సేన ఎంపి సంజయ్ రావత్ ధీమా వ్యక్తంచేశారు.