మేం చనిపోతాం సారూ.. అనుమతివ్వండి!
కారుణ్య మరణాన్ని అనుమతించాలంటూ మహారాష్ట్ర గవర్నర్, సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌లకు బుల్ధానా జిల్లాకు చెందిన 91 మంది రైతులు లేఖ రాశారు.
కారుణ్య మరణాన్ని అనుమతించాలంటూ మహారాష్ట్ర గవర్నర్, సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌లకు బుల్ధానా జిల్లాకు చెందిన 91 మంది రైతులు లేఖ రాశారు. పంటలకు మద్దతు ధర కల్పించాలన్న వినతికి ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు జాతీయ రహదారి కోసం భూములు తీసుకొని సరైన పరిహారం చెల్లించలేదని అన్నారు. కుటుంబాలను పోషించలేని తమకు మరణమే మార్గంగా మిగిలిందని వారు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణాంతక వ్యాధులతో రోజూ చస్తూ బతుకుతూ ఉండే రోగులకు వారు కోరితే కారుణ్య మరణాన్ని అనుమతించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం విదితమే. అయితే రైతుల దీనస్థితికి వారి లేఖలు అద్దం పడుతున్నాయని, చనిపోయేందుకు వారు అనుమతి కోరుతున్నారంటే సమస్య ఏపాటిదో అర్థం చేసుకోవాలని సామాజికవేత్తలు కోరారు. రుణమాఫీ, విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రైతులు ఇటీవల ముంబయి వరకూ మహా ప్రదర్శన చేశారు. కాగా, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇటీవలే హామీనిచ్చింది.