పంజాబ్ నేషనల్ బ్యాంకుకి వేలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు వెళ్లిపోయిన నీరవ్ మోదీకి సంబంధించిన అక్రమాస్తుల చిట్టాలో ఆయనకు అనేక బంగ్లాలు ఉన్నట్లు ప్రభుత్వానికి తెలిసింది. మహారాష్ట్రలోని అలీబేగ్ ప్రాంతంలో సరైన పర్మిషన్ లేకుండా నీరవ్ మోదీ నిర్మించిన ఓ అక్రమ బంగ్లాని కూల్చివేయమని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అనేక సంవత్సరాలుగా మురుద్, రాయగడ్, అలీబేగ్ ప్రాంతాల్లో అక్రమంగా ఇళ్లు, బంగ్లాలు నిర్మించడం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో కొన్ని బంగ్లాలు పంజాబ్ బ్యాంకుకు టోపీ పెట్టిన కేసులో నిందితులైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ పేరు మీద ఉండగా.. మరికొన్ని బంగ్లాలు స్మితా గోద్రెజ్, మధుకర్ పారేఖ్ లాంటి వ్యాపారస్తుల పేర్ల మీద కూడా ఉండడం గమనార్హం. అయితే ఇటీవలి కాలంలో అక్రమంగా కడుతున్న నిర్మాణాలపై కొరడా ఝలిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఈ విషయంలో ఉపేక్షించవద్దని అక్రమంగా నిర్మాణాలు చేపట్టేవారు ఎంత గొప్ప వ్యక్తులైనా.. వారి నిర్మాణాలు కూల్చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే నీరవ్ మోదీ బంగ్లాను కూడా కూల్చేయనున్నారు. 


అయితే ఇలా నిర్మాణాలను కూల్చేముందు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో నీరవ్ మోదీ బంగ్లాని కూల్చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. రాయగఢ్ జిల్లాలో కలెక్టరు లక్ష్యపెట్టలేదు. తర్వాత ఓ ఆర్టీఐ యాక్టివిస్టు పిటీషన్ ఫైల్ చేసి.. ఎందుకు నిర్మాణాలను కూల్చలేదు అని అడిగినప్పుడు.. మళ్లీ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.