ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం దేవేంద్ర ఫడ్నవిస్(CM Devendra Fadnavis) ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఓ మహిళకు ఆర్థిక సహాయం చేస్తూ జారీచేసిన చెక్కుపై తొలి సంతకం చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన కుసుం వెంగుర్లేకర్ అనే మహిళకు సీఎం ఫడ్నవిస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. నవంబర్ 23 శనివారం ఉదయం బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 


అయితే, మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి(Maharashtra govt) పూర్తిస్థాయిలో మెజార్టీ లేదని.. అలాగే ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శివసేన, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రస్తుతం ఆత్మరక్షణలో పడింది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ.. ఆ ప్రభుత్వానికి సర్వాధికారాలు కలిగి ఉన్నప్పటికీ..  కేవలం ప్రభుత్వం ఏర్పాటైన తీరుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున అక్కడి రాజకీయ సంక్షోభానికి(Maharashtra political crisis) ఇంకా తెరపడటం లేదు.