ఈఎస్ఐ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి, 106 మందికి గాయాలు!
ఈఎస్ఐ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం
ముంబై: ముంబైలోని అంధేరిలో వున్న కార్మిక రాజ్యబీమా ఆస్పత్రి (ఈఎస్ఐసీ)లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 106 మంది గాయపడ్డారు. సాయంత్రం 4:20 గంటలకు ఈఎస్ఐ ఆస్పత్రిలోని 4వ అంతస్తులో లెవల్ 3 తీవ్రతతో కూడిన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత మరో 30 నిమిషాల్లోనే మంటలు ఇతర వార్డులకు వ్యాపించడంతో అగ్ని ప్రమాదం తీవ్రత లెవల్ 4కు చేరుకుందని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న అగ్నిమాపక శాఖ అధికారి పి రహంగ్‌డేల్ తెలిపారు.
అగ్నిమాపక శాఖ, మహారాష్ట్ర విపత్తు బృందాలతో కలిసి బృహత్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ)కు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఎవరనేది ఇంకా గుర్తించలేదని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు.