కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి తన పదవిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం ఇష్టం లేదని దీదీ తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు తమకు పూర్తి వ్యతిరేకంగా పనిచేశాయని ఆరోపించిన ఆమె.. రాష్ట్రంలో ఒకరకంగా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను సృష్టించారని అన్నారు. హిందు-ముస్లింలను వేరు చేసి ఓట్లు దండుకున్నారని, ఈ విషయమై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మమతా బెనర్జి ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని మమతా బెనర్జి స్పష్టంచేశారు.


పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా అనేక చోట్ల హింస చెలరేగిన సంగతి తెలిసిందే. పలు చోట్ల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులపై సైతం దాడులు జరిగాయి. బీజేపి అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షోలోనే అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీజేపి కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ పతాక శీర్షికలకెక్కింది. ఈ హింస కారణంగానే పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం షెడ్యూల్ కన్నా 20 గంటల ముందే ముగిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నికల సంఘం అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.